అదానీ అగ్రి లొగిస్టిక్స్ లిమిటెడ్ కంపెనీ ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (FCI) తో అగ్రిమెంట్ కుదుర్చుకుని 700 కోట్ల వ్యయంతో సిలోస్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సిలోస్ నిర్మాణం పూర్తయ్యింది. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ స్టోరేజ్ నిర్మాణాలు చేప్పట్టనుంది అదానీ కంపెనీ. సిలోస్ అంటే, రైతులు పండించిన ఆహార పదార్థాలు భారీ స్థాయిలో కొనుగోలు చేసి ఏళ్ళ తరబడి పాడైపోకుండా భద్రపరిచే అత్యాధునిక స్టోరేజ్ టెక్నాలజీ. ఉదా : ఒక సంవత్సరంలో పంజాబ్ రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేసి దాన్ని 10-15 సంవత్సరాల వరకు పాడైపోకుండా సురక్షితంగా సిలోస్ లో భద్ర పర్చుతారు. నూతన వ్యవసాయ బిల్లు రైతు వ్యతిరేక బిల్లు మాత్రమే కాదు దేశంలోని ప్రతీ సగటు మనిషి వ్యతిరేక బిల్లు.
రైతుకి బోలెడు మేలు జరుగుతుందట, ఎలా?
రైతు పండించిన పంట మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేయాలంటే వ్యాపారస్తులు ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాలి. రైతుకి కనీస మద్దతు ధర (MSP) ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి వ్యాపారస్తుడు కచ్చితంగా రైతుకి ఆ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇది రైతుల కష్టానికి న్యాయమైన ఫలితం కాకపోయినా ఎంతో కొంత ఊరటనిస్తోంది. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారం సరుకుని ఎక్కడైనా కొనొచ్చు (మార్కెట్ యార్డ్ మాత్రమే కాకుండా ) అంటే రైతు దగ్గర పంట కొనే వ్యాపారస్తుడు గవర్నమెంట్ కి టాక్స్ చెల్లించాల్సిన పని లేదు. మార్కెట్ యార్డ్ లో అయితే ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది కానీ బయట అమ్మేటప్పుడు కొనేవాడే ధరలు నిర్ణయిస్తాడు. ఎక్కడపడితే అక్కడ కొనే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించినప్పుడు ఏ వ్యాపారస్తుడూ టాక్స్ చెల్లించి మార్కెట్ యార్డ్ లో కొనాలి అనుకోడు. రైతుల ఇష్టం వాళ్ళు వారి పంటని ఎక్కడైనా అమ్ముకోవొచ్చు అని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. మార్కెట్ యార్డ్ లో కనీస మద్దతు ధర వస్తుంది కదా అని రైతు ఎదురుచూస్తే కొనేవాడు లేక పండించిన పంట పాడైపోతుంటే రైతు చచ్చినట్టు బయట అమ్ముకోవాలి కార్పొరేట్లు ఇచ్చే అతి తక్కువ ధరకు. ఇలా కొంత కాలానికి మార్కెట్ యార్డ్లు పూర్తిగా మూతబడిపోతాయి.
ఈ బిల్లుతో చెమటోడ్చి పండించే రైతు ఆకలితో చస్తే, కార్పొరేట్లకు ఒక పక్క పన్ను కట్టాల్సిన పని లేదు మరో వైపు ఇప్పటికంటే తక్కువ ధరకు వాళ్ళు ఎంత తక్కువ కావాలనుకుంటే అంత తక్కువ ధరకు పంటను దోచుకోవచ్చు.
పంట ఎంత ఉన్నా… తిండి ఉండదు
ఇక ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు పరిమితంగా మాత్రమే నిల్వ చేసుకునేలా చట్టం ఉండేది. ఇప్పుడు ఈ కొత్త బిల్లుతో వ్యాపారస్తులు సరుకులను ఎంత పెద్ద మొత్తంలో అయినా కొనుగోలు చేసి ఎంత కాలమైనా భద్రపర్చుకోవొచ్చు. దీని వల్ల రైతులే కాదు చిన్న వ్యాపారస్తులు, ముఖ్యంగా వినియోగదారులు (అంటే మనం ) సర్వ నాశనం అయిపోతారు. బలిసిన కార్పొరేట్లు తమ దోపిడీ సొమ్ముతో మార్కెట్ లో ఉన్న సరుకు మొత్తం ఎప్పటికప్పుడు కొనేసి ఇలాంటి సిలోస్ స్టోరేజ్ లో ఏళ్ళ తరబడి దాచి కృత్రిమ కొరత సృష్టిస్తారు. ఇంతకాలం భారీ స్థాయిలో సరుకు నిల్వ చేసుకోకూడదు కాబట్టి చిన్న వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చేసుకునే అవకాశం ఉండేది. వాళ్ళు కొంత మేర దాచుకుని కొరత సృష్టించి ధరలు పెంచినా అది తాత్కాలికమే. కానీ ఇప్పుడు వీరు భారీ స్థాయిలో పంటలు కొనలేరు, కొన్నా దీర్ఘ కాలం నిల్వ చేయలేరు. కాబట్టి వ్యవసాయం మొత్తం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు చదువుకున్న డిమాండ్, సప్లై సూత్రం ఇక్కడ పని చేయదు. దేశంలో పంటలు పుష్కలంగా పండినా మనలాంటి వాళ్లకు తిండి ఉండదు. అదంతా బలిసినవాడి గిడ్డంగుల్లో మూలుగుతూ ఉంటుంది. సప్లై విపరీతంగా ఉన్నా అంతా దాచి డిమాండ్ ని అంతకు రెట్టింపు స్థాయిలో పెంచుతాడు. ఇంకేముంది ధరలకు రెక్కలు వచ్చి ఆకాశాన్ని తాకుతాయి. సరుకు అమ్ముడుపోకపోతే పూట గడవదనే బెంగ వాడికి లేదు, పాడైపోతుంది తొందరగా అమ్ముకోవాలి అనే ఆత్రం అంతకంటే లేదు. కానీ మనకు తిండి కావాలిగా లేకపోతే చచ్చిపోతాం. కొనగలిగేవాడు తింటాడు లేనివాడు చస్తాడు.
బీజేపీకి ఓటు వేసి దేశభక్తి చాటుకోండి!
సంపదంతా వాళ్ళ మేడల్లో కి చేరి చూస్తుండగానే ఈ దేశం దుర్భర దారిద్యంతో, ఆకలి చావులతో అలరారుతుంది. ఆకలి బాధ 100 రూపాయల కోసం కూడా దౌర్జన్యాలు, హత్యలు చేయిస్తుంది. కనీసం అప్పుడైనా తెలుసుకోండి మీ మతం, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడని. దేశభక్తి అంటే పాకిస్థాన్ వాడిని చంపడమో, చైనా వాడిని తన్నడమో కాదు. దేశంలో ఉన్న ప్రజలంతా సామరస్యంగా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలనుకోవడానికి మించిన దేశ భక్తి లేదు.